విజయసాయిరెడ్డిలాంటి పందికొక్కులను తరిమికొట్టాలి: టీడీపీ నేత పట్టాభి

19-02-2021 Fri 14:59
  • పోస్కో కంపెనీ ప్రతినిధులను పిలిపించుకుని జగన్ మాట్లాడారు
  • 7 వేల ఎకరాల అమ్మకానికి సిద్ధమవుతున్నారు
  • జగన్ డ్రామాను ప్రజలంతా అర్థం చేసుకోవాలి
Pigs like Vijayasaireddy should be repelled says Pattabhi

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మొగ్గుచూపుతున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. పోస్కో కంపెనీ ప్రతినిధులను జగన్ పిలిపించుకుని మాట్లాడారని చెప్పారు. కరోనా కారణంగా విశాఖ స్టీల్ కు కొద్దిగా నష్టాలు వచ్చాయని, దాన్ని సాకుగా చూపి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అమ్మకానికి పెట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటుపరం చేసేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో జగన్ బంధువు, ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ఉన్నాడని... ప్రతి ఒక్కటీ జగన్ కు తెలిసే జరిగిందని... ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్టు ప్రధాని మోదీకి లేఖ రాశారని విమర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 7 వేల ఎకరాల భూమిని అమ్మేస్తే ప్లాంటు ప్రైవేటుపరం కాదని విశాఖలో జగన్ చాలా సులువుగా చెప్పేశారని... 7 వేల ఎకరాల అమ్మకానికి సిద్ధమయ్యారంటే, దీని వెనుక కార్యాచరణ ఎప్పటి నుంచి జరుగుతోందో అర్థమవుతుందని పట్టాభి అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములు కొనడానికి వారెవరు, అమ్మడానికి వీరెవరని ప్రశ్నించారు. దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన భూముల కబ్జాకు వైసీపీ కుట్ర చేస్తోందని అన్నారు. విశాఖ కర్మాగారం ఉద్యమంలో పాల్గొనడానికి అర్హతలేని నాయకులను... ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కులను తరిమికొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆడుతున్న డ్రామాను ప్రజలంతా అర్థం చేసుకోవాలని... ఆయనను గట్టిగా నిలదీయాలని కోరారు.