కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింక్స్ ఫ్రీ.. ఇజ్రాయెల్ పబ్ ఆఫర్!

19-02-2021 Fri 13:36
  • ఇజ్రాయెల్ లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
  • టెల్ అవీవ్ లో ఆఫర్ ప్రకటించిన ఓ పబ్
  • వ్యాక్సిన్ వేయించుకుంటే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్
  • వ్యాక్సిన్ తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహిస్తున్న వైనం
A Tel Aviv pub offers free drink along with corona vaccine shot

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అన్ని దేశాల కంటే  ఇజ్రాయెల్ లో కరోనా టీకాల కార్యక్రమం జోరుగా సాగుతోంది. సుమారు 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 43 శాతం మందికి టీకా ఇచ్చారు.  తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని ఓ బార్ పసందైన ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింక్స్ ఫ్రీ అంటూ ఊరిస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో ఇజ్రాయెల్ లోని చాలా బార్లు, పబ్ లు మూతపడ్డాయి.

అయితే స్థానిక మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకున్న జెనియా గాస్ట్రోపబ్ కస్టమర్లు కరోనా టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు పబ్ లో ఉచితంగా డ్రింక్స్ తాగొచ్చు. అయితే ఆరోగ్యపరమైన కారణాల రీత్యా ఆల్కహాల్ లేని డ్రింక్స్ (నాన్ ఆల్కహాలిక్) ను అందించనుంది. మే పెరెజ్ అనే టెల్ అవీవ్ పౌరుడు దీనిపై స్పందిస్తూ, కరోనా వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ వేస్తారు? ఇలాంటి వాటి గురించి సమయం వృథా చేసుకోలేమని, తనకు అంత సమయంలేదని తెలిపాడు. తనలాంటివాళ్లకు ఈ పబ్ ప్రకటించిన ఆఫర్ చాలా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.