ఉన్నావో దారుణంపై దుమారం.. నాటి మోదీ వీడియోను ప్రదర్శించి, ప్రశ్నించిన కాంగ్రెస్

19-02-2021 Fri 09:17
  • మరో బాలికను ఎయిమ్స్‌కు తరలించాలంటూ డిమాండ్
  • బాలికలపై విషప్రయోగం జరిగిందని తేల్చిన పోస్టుమార్టం నివేదిక
  • బాలికలు, మహిళలపై నేరాలకు యూపీ కేంద్రస్థానంగా మారిందన్న అల్కాలాంబా
Congress fires on Unnao incident

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో మరో దారుణం జరిగింది. పశువులకు గడ్డి కోసం పొలానికి వెళ్లిన ముగ్గురు బాలికలు తొలుత అదృశ్యం కాగా, ఆ తర్వాత ముగ్గురిని వెతుకుతుండగా ఓ పొలంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారిలో ఇద్దరు మరణించినట్టు నిర్ధారించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాన్పూరులోని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు.

కాగా, మరణించిన ఇద్దరు బాలికల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాలికలపై విష ప్రయోగం జరిగిందని, అంతకుముందు వారిని దుపట్టాలతో కట్టివేశారని నివేదిక పేర్కొంది. విష ప్రయోగం కారణంగానే వారు మరణించినట్టు నివేదిక ధ్రువీకరించింది.  

మరోవైపు, మూడో బాలిక చికిత్స పొందుతున్న రీజెన్సీ ఆసుపత్రికి చేరుకున్న భీమ్ ఆర్మీ కార్యకర్తలు మెరుగైన చికిత్స కోసం బాలికను ఎయిమ్స్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత ఉన్నావోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. బాధిత కుటుంబాలను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.

ఉన్నావో ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అల్కా లాంబా నిన్న ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ‘బేటీ బచావో.. బేటీ పడావో’ స్లోగన్ బాలికలకు హెచ్చరికలా తయారైందని అన్నారు. ఈ సందర్భంగా 2017లో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని అందులో మోదీ ఆరోపించారు. అప్పటి అధికార సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు.

ఈ వీడియోను ప్రదర్శించిన అల్కాలాంబా.. ఉన్నావో సంగతేంటని ప్రశ్నించారు. మొన్నటి హత్రాస్ ఘటనను మర్చిపోకముందే ఉన్నావో ఘటన జరగడం దారుణమన్నారు. యూపీలో నేరగాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతుంటే, బాధిత కుటుంబాలను పోలీస్ స్టేషన్‌లో పెడుతున్నారని ఆరోపించారు. అత్యాచారాలు, మహిళలు, బాలికలపై నేరాలకు యూపీ కేంద్ర స్థానంగా మారిందని దుమ్మెత్తిపోశారు. కాన్పూరులో చికిత్స పొందుతున్న బాలికను ఎయిమ్స్‌కు ఎందుకు తరలించడం లేదని లాంబా ప్రశ్నించారు.