ఈ ఏడాది పరిమితి మేరకు హెచ్​1బీ వీసాలకు దరఖాస్తులు వచ్చాయి​: అమెరికా ఇమిగ్రేషన్​ అధికారులు

18-02-2021 Thu 15:09
  • రెగ్యులర్ కు 65 వేలు.. అడ్వాన్స్ డ్ డిగ్రీ వీసాకు 20 వేల దరఖాస్తులు
  • కంప్యూటర్ లక్కీ డ్రా ద్వారా వీసాలకు దరఖాస్తుదారుల ఎంపిక
  • ఇప్పటికే వీసా ఉన్నవారు గడువు పెంచుకునేందుకు అవకాశం
United States Has Reached H1B Visa Cap For 2021

హెచ్1బీ వీసాలకు 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విధించిన పరిమితి మేరకు దరఖాస్తులు వచ్చాయని, అందులో నుంచి లక్కీ డ్రా తీసి ఎంపికైన వారికి వీసాలు ఇస్తామని అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం పేర్కొంది.

హెచ్1బీ రెగ్యులర్ వీసాలపై అమెరికా కాంగ్రెస్ విధించిన పరిమితి 65 వేలు, అడ్వాన్స్ డ్ డిగ్రీ మినహాయింపు కింద మరో 20 వేల వీసాలకు దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సీఐఎస్ పేర్కొంది. కంప్యూటర్ ద్వారా డ్రా తీస్తామని, అందులో పేర్లు వచ్చిన వారికి వీసాలు ఇస్తామని వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ‘నాన్ సెలెక్షన్’ నోటిఫికేషన్లను పంపుతున్నామని వివరించింది.

ఇంతకుముందు ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరం విధించిన పరిమితి నుంచి మినహాయింపునిస్తున్నామని వెల్లడించింది. వారు గడువు పెంచుకునేందుకు దరఖాస్తులు పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.