Shabnam: ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను చంపిన షబ్నమ్ ఉరిశిక్ష అమలుకు సర్వం సిద్ధం!

  • పెళ్లికి నిరాకరించారని ఘాతుకం
  • తల్లిదండ్రులు, సోదరులు, సోదరిని దారుణంగా నరికి చంపిన షబ్నమ్
  • స్వాతంత్య్రానంతరం ఉరితీతకు గురయ్యే తొలి మహిళ   
Shabnam who axed kin to death for love likely to be first woman hanged in independent India

ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్ ఉరిశిక్ష అమలుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసు దోషులను ఉరి తీసిన పవన్ జల్లాద్ ఆమెనూ ఉరితీయనున్నాడు. అయితే, ఉరి తేదీని ఖరారు చేయాల్సి ఉంది.

రాష్ట్రంలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది. ఇందులో ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరులు, ఓ సోదరి కూడా వున్నారు.

ఈ కేసులో షబ్నమ్‌, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, అక్కడా వారికి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా వారికి ఊరట లభించలేదు.

కాగా, షబ్నమ్‌ను ఉరితీయనున్న పవన్ జల్లాద్ ఇప్పటికే రెండుసార్లు ఉరితీసే గదిని పరిశీలించారు. షబ్నమ్ ఉరి శిక్ష కనుక అమలైతే స్వతంత్ర భారతదేశంలో మహిళను ఉరి తీయడం ఇదే తొలిసారి అవుతుంది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన మహారాష్ట్రకు చెందిన అక్కాచెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్న వారికి ఇంకా శిక్ష అమలు కాలేదు.

More Telugu News