ఇక్కడ పార్టీ పెట్టే బదులు.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడండి: షర్మిలకు గంగుల హితవు

17-02-2021 Wed 17:33
  • జగన్ కు షర్మిల మాత్రమే బాణం
  • కేసీఆర్ కు కోట్లాది బాణాలు ఉన్నాయి
  • టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి
YS Sharmila has to fight for separate Rayalaseema

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిలను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణకు జగనన్న బాణంతో పని లేదని అన్నారు. జగన్ కు షర్మిల మాత్రమే బాణమని, తమ అధినేత కేసీఆర్ కు కోట్లాది బాణాలు ఉన్నాయని చెప్పారు. ఎన్ని బాణాలు వచ్చినా కేసీఆర్ దెబ్బకు అవన్నీ వెనక్కి తిరిగి పోతాయని... తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్షకుడివంటి వారని అన్నారు.

కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని మండిపడ్డారు. షర్మిల ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాలని హితవు పలికారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సీమవాసులు సంతోషంగా ఉంటారని... ఇక్కడ తాము కూడా సంతోషంగా ఉంటామని అన్నారు. టీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సైతం టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.