కృష్ణవంశీ తదుపరి సినిమాలో శ్రీదేవి తనయ?

16-02-2021 Tue 20:45
  • బాలీవుడ్ లో రాణిస్తున్న జాన్వీకపూర్
  • పేరుతెచ్చిన 'గుంజన్ సక్సేనా' సినిమా 
  • కృష్ణవంశీ మహిళా ప్రధాన చిత్రంలో ఛాన్స్   
Jahnvy Kapoor to work with Krishna Vamshi

శ్రీదేవి తనయగా బాలీవుడ్ కి పరిచయమైనా.. కథానాయికగా ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్న అందాలతార జాన్వీకపూర్. ఇటీవల ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా' సినిమా నటిగా ఆమెకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె హిందీలో 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్ లో బిజీగా వుంది.

ఇదిలావుంచితే, జాన్వీని తెలుగు సినిమాలో నటింపజేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచి ఆఫర్ వస్తే తన కూతుర్ని టాలీవుడ్ కి పరిచయం చేయాలని తండ్రి బోనీకపూర్ కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీకి తెలుగు చిత్రసీమ నుంచి మంచి ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి సినిమాను మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీని కథానాయికగా తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. కథను కూడా జాన్వీని దృష్టిలో పెట్టుకునే ఆయన తయారుచేశారట. ప్రస్తుతం ఈ ప్రాజక్టు గురించి సంప్రదింపులు జరుగుతున్నట్టు, జాన్వీ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.