మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి: పవన్ కల్యాణ్

16-02-2021 Tue 18:14
  • ఏపీలో మార్చి 10న పురపాలక ఎన్నికలు
  • నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ
  • గతంలో ఎక్కడ ఆగిందో అక్కడ్నించి మొదలవుతుందని వెల్లడి
  • అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేనాని
Pawan Kalyan wants fresh notification for municipal elections in AP

ఏపీలో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ  ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభం అయ్యేట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది చేపట్టిన పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార పక్షం దౌర్జన్యాలతో ఎంతోమంది నిజాయతీపరులు పోటీకి దూరమయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్ పై ఎస్ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రకటన చేయడం సంతోషం కలిగించినా, గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పడం అసంతృప్తి కలిగించిందని తెలిపారు. అందుకే మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గానీ, పంచాయతీ ఎన్నికల్లో ఏ స్ఫూర్తి కనబర్చారో అదే స్ఫూర్తిని పురపాలక ఎన్నికల్లోనూ చూపించాలని పవన్ కల్యాణ్ జనసైనికులు, ఆడపడుచులు, నేతలకు పిలుపునిచ్చారు.