Sourav Ganguly: ప్రతి సిరీస్ లో ఒక పింక్ బాల్ టెస్టుతో ఐదు రోజుల ఆట కళకళలాడుతుంది: సౌరవ్ గంగూలీ

Sourav Ganuly says one pink ball test for one series is ideal
  • ఫిబ్రవరి 24 నుంచి భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు
  • అహ్మదాబాద్ లో పింక్ బాల్ తో డేనైట్ టెస్టు
  • టికెట్లు అయిపోయాయన్న గంగూలీ
  • పింక్ బాల్ టెస్టుకు ప్రేక్షకాదరణ ఉంటుందని వెల్లడి

టెస్టు క్రికెట్లో డేనైట్ మ్యాచ్ లకు పింక్ బాల్ ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో పింక్ బాల్ టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రతి సిరీస్ లో ఒక పింక్ బాల్ టెస్టుతో ఐదు రోజుల క్రికెట్ ఫార్మాట్ ను సజీవంగా ఉంచేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పింక్ బాల్ టెస్టులతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు తరలివస్తారని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో జరిగే పింక్ బాల్ టెస్టుకు టికెట్లన్నీ అమ్ముడు కావడం గంగూలీ అభిప్రాయాలను బలపరుస్తోంది.

నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్, ఇంగ్లండ్ 1-1తో సమవుజ్జీలుగా నిలవడంతో మూడో టెస్టుకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. పైగా డేనైట్ విధానంలో పింక్ బాల్ తో జరగనుండడంతో క్రికెట్ అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

దీనిపై గంగూలీ మాట్లాడుతూ "అహ్మదాబాద్ స్టేడియంలో టికెట్లన్నీ అయిపోయాయి. బీసీసీఐ కార్యదర్శి జై షాతో మాట్లాడాను. ఈ టెస్టు మ్యాచ్ లపై షా ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. దాదాపు ఆరేడేళ్ల తర్వాత అహ్మదాబాద్ కు క్రికెట్ తిరిగొచ్చింది. ఇప్పుడక్కడ కొత్త స్టేడియం కట్టారు. గతేడాది కోల్ కతాలో పింక్ బాల్ టెస్టును విజయవంతంగా నిర్వహించి ఓ ఉదాహరణగా నిలిచామని షాతో చెప్పాను. అహ్మదాబాద్ లోనూ అన్ని సీట్లు నిండిపోవాలని కోరుకున్నాను. అందుకు తగ్గట్టుగానే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. టెస్టుల తర్వాత జరిగే టీ20 సిరీస్ కు కూడా టికెట్లు అయిపోయాయి. అభిమానులతో స్టేడియాలు మళ్లీ కళకళలాడాలన్నదే మా ఆకాంక్ష" అని వివరించారు.

  • Loading...

More Telugu News