Vijayalakshmi: వర్షాలపై నా మాటలు వక్రీకరించారు: మేయర్ విజయలక్ష్మి 

  • నగరంలో వర్షాలే పడకూడదని విజయలక్ష్మి అన్నట్టు ప్రచారం
  • సోషల్ మీడియాలో మేయర్ వ్యాఖ్యలు వైరల్
  • వివరణ ఇచ్చిన విజయలక్ష్మి
  • నగరాన్ని ముంచెత్తే రీతిలో వర్షాలు పడకూడదని కోరుకున్నట్టు వెల్లడి
Hyderabad Mayor Vijayalakshmi clarifies her remarks on rains

తన పదవీకాలంలో వర్షాలు రాకూడదని దేవుడ్ని మొక్కుకుంటాను అంటూ హైదరాబాద్ నగర నూతన మేయర్ విజయలక్ష్మి అన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై మేయర్ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. వర్షాల అంశంలో తాను వెల్లడించిన అభిప్రాయాలను వక్రీకరించారని ఆరోపించారు.

గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాదును భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని, ఆ స్థాయిలో వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడ్ని కోరుకున్నానే తప్ప, అసలు హైదరాబాదులో వర్షాలే పడకూడదని తాను మొక్కుకోలేదని వివరణ ఇచ్చారు. ఆ విధంగా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని విజయలక్ష్మి అన్నారు. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు.

అటు, షేక్ పేట తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన పాత్ర ఉందన్న ఆరోపణలపైనా ఆమె వివరణ ఇచ్చారు. తహసీల్దార్ బదిలీ వ్యవహారం రెవెన్యూ విభాగానికి సంబంధించిన విషయం అని, అది తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. తనపై రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని తహసీల్దార్ కూడా చెప్పారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి ఇటీవలే మేయర్ గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె అన్న విషయం తెలిసిందే.

More Telugu News