Private Teachers: పూట గడవడానికి.. బంగారం, బండ్లు అమ్మేకుంటున్న ప్రైవేట్​ టీచర్లు

  • 93 శాతం మందిది అదే పరిస్థితి.. భారత్ దేఖో సర్వేలో వెల్లడి
  • కనీసం ఐదు నెలల కిరాయి బాకీ పడిన 83 శాతం మంది
  • ఆదా చేసుకున్న డబ్బూ లాక్ డౌన్ రోజులకే
90 percent private teachers in Hyderabad sold gold for survival

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే టీచర్లు.. తమ బతుకు కోసం బంగారం అమ్ముకుంటున్నారు. నిలువ నీడ కోసం, జానెడు పొట్ట నింపడం కోసం అప్పు బాట పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో హైదరాబాద్ లోని 90 శాతం మంది టీచర్ల పరిస్థితి ఇదే. 83 శాతం మంది టీచర్లు ఐదు నెలల ఇంటి కిరాయి బాకీ పడ్డారు. భారత్ దేఖో అనే యువత స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 220 మంది ప్రైవేట్ టీచర్లను సర్వే చేసిన సంస్థ.. వారికి కనీసం ఆరోగ్య బీమా కూడా లేదని తేల్చింది. ‘‘ప్రస్తుతం ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ సర్వే చేసినట్టు భారత్ దేఖో సహ వ్యవస్థాపకురాలు రోమిలా జిల్లెళ్ల తెలిపారు. లాక్ డౌన్ తో కోల్పోయిన ఉపాధి వల్ల వారి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు.

టీచర్లందరూ బిల్లులు కూడా కట్టలేకపోయారని సర్వే తేల్చింది. సమీప బంధువుల నుంచి రూ.30 వేలు ఆపైన అప్పుగా తీసుకున్నట్టు 90 శాతం మంది చెప్పారు. అందరూ ఆదా చేసుకున్న డబ్బునూ ఖర్చు చేశారు. చాలా మంది బంగారం అమ్ముకున్నారని, కొందరు తాకట్టు పెట్టారని సర్వేలో పాల్గొన్న టీచర్లు చెప్పారు. కొందరు బైకులు అమ్మేశారు.

పూట గడవడం కష్టమవ్వడంతో తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకున్నానని చంద్రశేఖర్ రావు అనే టీచర్ ఆవేదన చెందారు. ఓ ప్రైవేట్ స్కూల్ లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్న ఆయన.. గత ఏడాది ఏప్రిల్ నుంచి తాను పనిచేసే విద్యాసంస్థ జీతాలివ్వడం లేదని చెప్పారు. లాక్ డౌన్ లో రోజువారీ అవసరాలు తీర్చేందుకు తన బైకును అమ్మేశానని మరో టీచర్ రాము నాయక్ చెప్పారు. ఆ తర్వాత మరీ కష్టంగా మారడంతో సొంతూరుకు వెళ్లానని తెలిపారు. ఇప్పటిదాకా తన ఇంటి కిరాయి కూడా కట్టలేదన్నారు.

More Telugu News