Vijayasai Reddy: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమే: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy says YCP government will fight for Vizag Steel Plant in any manner
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ప్రత్యామ్నాయాలు సూచించిన సీఎం జగన్
  • సీఎం సూచనలను కేంద్రం పట్టించుకోవడంలేదు 
  • ఈ నెల 20న ఉక్కు పోరు యాత్ర చేపడుతున్నట్టు వెల్లడి
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకుని, సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైసీపీ సర్కారు తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ విధానాలను సూచించారని వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడం వాటిలో ముఖ్యమైనదని తెలిపారు. సొంత గనులు ఉంటే ఒక్కో టన్ను ఖనిజంపై గరిష్టంగా రూ.7 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. ఉక్కు పరిశ్రమ రుణాలను ఈక్విటీ కింద మార్చాలని కూడా సీఎం జగన్ ప్రతిపాదించారని, ఈ రెండు ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తే 6 నెలల్లో ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టడం ఖాయమని అన్నారు. దీనిపై వైసీపీ గట్టి నమ్మకంతో ఉందని విజయసాయి వివరించారు.

అయితే సీఎం జగన్ చేసిన సూచనలను కేంద్రం ఇప్పటివరకు అంగీకరించలేదని వెల్లడించారు. అందుకే తాము పోరుబాట పడుతున్నామని, ఇకపై ఉక్కు పోరు ఢిల్లీకి వినబడేలా గర్జిస్తామని అన్నారు. ఈ నెల 20న విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర చేస్తున్నామని, విశాఖ పరిధిలోని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేపడుతున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
Vijayasai Reddy
YSRCP
Vizag Steel Plant
Visakhapatnam
Jagan
Andhra Pradesh

More Telugu News