'ఆర్.ఆర్.ఆర్'లో పాట పాడుతున్న బాలీవుడ్ భామ!

15-02-2021 Mon 21:39
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్.ఆర్.ఆర్'
  • చివరి దశకి చేరుకున్న షూటింగ్ కార్యక్రమం
  • హిందీ వెర్షన్ కి పాట పాడుతున్న అలియా
Alia sings for RRR

తెలుగులో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్టు చిత్రాలలో ముందువరసలో వున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అసలుసిసలు మల్టీస్టారర్ గా దీనిని చెప్పుకోవచ్చు. స్టార్ కేస్టింగ్ పరంగా చూసినా.. నిర్మాణం పరంగా చూసినా .. ఏ విధంగా చూసినా భారీ చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

ఈ క్రమంలో ఇప్పుడు చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే, చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ ఈ చిత్రంలో ఓ పాట పాడనుందట. అలియా మంచి సింగర్ కూడా అన్న సంగతి బాలీవుడ్ సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. గతంలో ఆమె 'హైవే', 'హంటీ శర్మా కీ దుల్హనియా' వంటి సినిమాలో పాటలు పాడి గాయనిగా కూడా అలరించింది. ఇప్పుడు రాజమౌళి కోరికపై 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ కి ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను ఆమెపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదేనిజమైతే కనుక సినిమాకి ఇది ఒక అదనపు ఆకర్షణ అవుతుందనే చెప్పచ్చు!