Maharashtra: మహారాష్ట్రలో మరోసారి కరోనా కలకలం.. మళ్లీ పెరిగిన కేసులు!

  • నిన్న ఒక్క రోజే 4,092 కేసుల నమోదు
  • ప్రాణాలు కోల్పోయిన 40 మంది కరోనా పేషెంట్లు
  • ముంబైలో కొత్తగా 645 కేసుల నమోదు
Maharashtra Reports Over 4000 New Covid Cases

మహారాష్ట్రను కరోనా వైరస్ వణికించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా జీవనం మళ్లీ గాడిలో పడింది. అయితే, మహారాష్ట్ర తాజాగా మరోసారి ఉలిక్కిపడింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 4,092 కరోనా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 40 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదిలారు. 1,355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేసులు తగ్గుతున్న సమయంలో మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది.

మహారాష్ట్రలో తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 20,64,278 కేసులు నమోదయ్యాయి. మొత్తం 51,529 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,965 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 95.7 శాతంగా ఉంది. మరణాల రేటు 2.5 శాతంగా ఉంది.

ముంబై విషయానికి వస్తే, నిన్న ఒక్క రేజే 645 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,14,076కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 11,419 మరణాలు సంభవించాయి. మరోవైపు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, హింగోళీ నగరాల్లో గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు.

More Telugu News