Mahapanchayat: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేది లేదు: రైతు సంఘం నేత

  • కొత్త చట్టాలతో పౌర సరఫరాల వ్యవస్థ నాశనం
  • ఇవి బడా కార్పొరేట్లకు మేలు చేసేవే
  • మహా పంచాయత్ ను ఉద్దేశించి రాకేశ్ తికాయత్
Wont let government Sit in Peace Says Farmer Leaders

కేంద్రం తీసుకుని వచ్చిన సాగు చట్టాలు పౌర సరఫరాల వ్యవస్థను సర్వనాశనం చేస్తాయని, తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనివ్వబోమని రైతు సంఘం 'భారత్ కిసాన్' నేత రాకేష్ తికాయిత్ హెచ్చరించారు. కర్నాల్ సరిహద్దుల్లోని ఇంద్రి గ్రెయిన్ మార్కెట్ వద్ద  జరుగుతున్న 'మహా పంచాయత్'లో ఆయన ప్రసంగించారు. రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలూ ఈ విషయంలో ఒకే మాటపై ఉన్నారని అన్నారు.

"రైతులకు మేలు కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకూ తమ ఆందోళనలు ఆగబోవు. మా డిమాండ్లను నెరవేర్చాల్సిందే. ఈ చట్టాల రద్దును మాత్రమే మేము కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు. ఈ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే నష్టదాయకం కాదని, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు తదితరులపైనా ప్రభావం చూపనున్నాయని చెప్పారు. ఆసలు ఏ ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకునివచ్చారో కూడా తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

'ముందు గోడౌన్ లను నిర్మించారు. ఆ తరువాత చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాత్రమే లాభాన్ని చేకూరుస్తాయన్న సంగతి రైతులకు తెలియదా ఏమిటీ?' అని ఆయన అన్నారు. ఆకలిపై వ్యాపారం చేస్తామంటే, అంగీకరించే పరిస్థితి ఈ దేశంలో లేదని స్పష్టం చేశారు. రైతుల నిరసనలకు సింఘూ సరిహద్దులే కేంద్రంగా ఉంటాయని ఆయన అన్నారు.

More Telugu News