Monkeys: 8 రోజుల కవలలను ఎత్తుకెళ్లిన కోతులు!

Monkeys fling eight day old to death in moat twin rescued
  • ఓ చిన్నారిని కందకంలోకి విసిరేయడంతో మృతి, మరో చిన్నారి క్షేమం
  • ఇంటి పెంకులు తీసేసి ఇంట్లోకి జొరబడ్డాయన్న ఇల్లాలు
  • పిల్లల ఒంటి మీద ఒక్క కోతి గాటు కూడా లేదన్న పోలీసులు
  • తమిళనాడులోని తంజావూరులో దారుణం
ఆ దంపతులకు కవలలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలే. ఆ ఆనందాన్ని లేకుండా చేశాయి కోతులు. ఎనిమిది రోజుల పసికందును ఎత్తుకెళ్లి కందకంలో పడేసి చంపేశాయి. అయితే, కోతులు పిల్లలను ఎత్తుకెళ్లడం అసాధ్యమని, పిల్లలపై అసలు కోతుల గోటి గీతలు లేనేలేవని డాక్టర్లు చెబుతున్నారు. తమిళనాడులోని తంజావూరు కోటకు సమీపంలోని మేళాంగళంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలేమైందంటే...

పెయింటర్ గా పనిచేసే రాజా (29), భువనేశ్వరి (26)లకు ఐదేళ్ల పాప ఉంది. ఈ నెల 6న ఇద్దరు కవల పిల్లలకు భువనేశ్వరి జన్మనిచ్చింది. శనివారం కోతులు వారికి విషాదాన్ని మిగిల్చాయి. ఉదయం రాజా పనికి వెళ్లిపోగా.. భువనేశ్వరి ముగ్గురు పిల్లలతో ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో భువనేశ్వరి ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. ఆ సమయంలోనే ఇంటి పైకప్పుపై ఉన్న పెంకులను తొలగించి కోతులు ఇంట్లోకి జొరబడ్డాయి. చాపపై పడుకోబెట్టిన ఇద్దరు పసిపిల్లలను ఎత్తుకెళ్లాయి.

అయితే, పిల్లల ఏడుపులు వినిపిస్తుండడంతో పరుగున వచ్చానని భువనేశ్వరి చెప్పింది. ఇంటిపైన పాపను పట్టుకున్న కోతి కనిపించిందని తెలిపింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారని, వారు కోతిని తరమడంతో పాపను వదిలివెళ్లిందని చెప్పింది. ఆ చిన్నారికి ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే, రెండో చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెతకగా తంజావూరు కోట చుట్టూ తవ్విన కందకంలో పాప మృతదేహం కనిపించింది.

పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. మరో చిన్నారిని అదే ఆస్పత్రిలో అబ్జర్వేషన్ లో పెట్టారు. చనిపోయిన చిన్నారి ఒంటిపైగానీ, బతికున్న చిన్నారి ఒంటిపైనగానీ కోతి గోటి ఆనవాళ్లే లేవని డాక్టర్ చెప్పారు. పిల్లలను కోతుల్లాంటి జంతువులు ఎత్తుకెళ్లినప్పుడు పిల్లల కీళ్లు పట్టుదప్పే అవకాశం ఉందని, కానీ, అలాంటి ఆనవాళ్లేమీ కనిపించలేదని తెలిపారు.

వారి ఒంటి మీద ఒక్క గాటు కూడా లేదని చెప్పారు. ఇక, కోతులు పెంకులు తీసి.. అందులో నుంచి ఇంట్లోకి వెళ్లి పిల్లలను ఎత్తుకుని, మళ్లీ ఆ రంధ్రంలో నుంచే వెళ్లడం అసాధ్యమని తంజావూర్ ఫారెస్ట్ రేంజర్ జి. జోతికుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఆడపిల్లలు కావడంతో తల్లిదండ్రులే ఈ నాటకమాడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Monkeys
Twins
Tamil Nadu
Tanjavuru

More Telugu News