Arjun Mark1A: శత్రుభీకర అర్జున్ ట్యాంక్ ను సైన్యానికి అప్పగించిన ప్రధాని మోదీ

PM Modi handed over updated Arjun Tank to Indian Army
  • ఆత్మనిర్భర్ లో భాగంగా దేశీయంగా ఆయుధాల తయారీ
  • ఇటీవలే తేజస్ ను వాయుసేనకు అప్పగింత
  • తాజాగా భారత దళాలకు మరో భారీ ఆయుధం
  • అర్జున్ మార్క్-1ఏ ట్యాంకును జనరల్ నరవాణేకు అప్పగించిన ప్రధాని
ఆత్మనిర్భర్ కార్యాచరణలో భాగంగా అత్యాధునిక ఆయుధాలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయడం ఇటీవల కాలంలో ప్రాధాన్యతాంశంగా మారింది. శత్రు వ్యవస్థలను తుత్తునియలు చేసే అర్జున్ ట్యాంక్ కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ప్రపంచస్థాయి యుద్ధ ట్యాంకు అర్జున్ (మార్క్-1ఏ)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సైన్యానికి అప్పగించారు. ప్రధాని తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో అర్జున్ ట్యాంక్ ను భారత సైన్యాధిపతి ఎంఏ నరవాణేకు లాంఛనంగా అందజేశారు.

ఆత్మనిర్భర్ కింద ఇటీవలే తేజస్ ఎల్సీఏ యుద్ధ విమానాన్ని భారత వాయుసేనకు అందించిన తర్వాత భారత దళాలకు అందించిన మరో భారీ అస్త్రం ఇదే. దీన్ని డీఆర్డీవోకు చెందిన కంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెట్ ఎస్టాబ్లిష్ మెంట్ (సీవీఆర్డీఈ) రూపొందించింది. సైన్యంలో అర్జున్ ట్యాంకులు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. అయితే అవి ఎంబీటీ వెర్షన్ ట్యాంకులు. సీవీఆర్డీఈ నిపుణులు వాటికి భారీగా మార్పులు, చేర్పులు చేసి సరికొత్త అర్జున్ (మార్క్-1ఏ) ట్యాంకులను రూపొందించారు. వీటిని 'హంటర్ కిల్లర్స్' గా భావిస్తుంటారు.

68 టన్నుల బరువుండే మార్క్-1ఏ ట్యాంకులు ఎలాంటి సంక్లిష్ట వాతావరణంలోనైనా పనిచేస్తాయి. ఈ నూతన తరం ట్యాంకుల్లో ఉండే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ప్రపంచంలో మరే యుద్ధ ట్యాంకుల్లో లేవు. లక్ష్యాన్ని తనంతట తానుగా ట్రాక్ చేసే వ్యవస్థ అర్జున్ మార్క్-1ఏ సొంతం. తద్వారా వేగంగా కదులుతున్న లక్ష్యాలను ఛేదించడమే కాదు, తాను వేగంగా ప్రయాణిస్తూ కూడా గురితప్పకుండా లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. పగలు మాత్రమే కాదు రాత్రివేళల్లోనూ ఇది సమర్థంగా దాడులు చేయగలదు.

ఆఖరికి దీంట్లో ఉపయోగించే షెల్స్ (ఫిరంగి గుండ్లు) కూడా అత్యాధునిక సాంకేతికతో తయారైనవే. ఒక్కసారి లక్ష్యాన్ని చేరాక తొలుత చొచ్చుకుపోతుంది. ఆపై అక్కడి ఆక్సిజన్ ను ఉపయోగించుకుని విస్ఫోటనం చెందుతుంది. ఎదురుదాడులే కాదు, స్వీయరక్షణలోనూ అర్జున్ (మార్క్-1ఏ) ట్యాంకు మేటి అని చెప్పాలి.
Arjun Mark1A
Battle Tank
Narendra Modi
Army
India

More Telugu News