Donald Trump: నా రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైంది: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

  • అభిశంసన వీగిపోయిన తర్వాత ట్రంప్ ప్రకటన
  • అమెరికాను గొప్పగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడి
  • దేశ భవిష్యత్ బాగుండేలా త్వరలో కొత్త ప్రణాళిక ప్రకటిస్తానని వ్యాఖ్య
My Political Movement Has Only Just Begun says Trump after acquittal from Impeacment

సెనేట్ లో తనపై పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందంటూ వ్యాఖ్యానించారు. “అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్డడం కోసం దేశభక్తి నిండిన మన చారిత్రక, అందమైన ఉద్యమం ఇప్పుడే మొదలైంది’’ అంటూ కామెంట్ చేశారు. సెనేట్ లో తీర్మానం వీగిపోయిన కాసేపటికే ఆయన ఈ ప్రకటన జారీ చేశారు.

‘‘రాబోయే రోజుల్లో మీతో మరిన్ని విషయాలు పంచుకుంటాను. అమెరికాను గొప్పగా తీర్చిదిద్దేందుకు, ప్రజలందరికీ దాని ఫలాలను అందించేందుకు మళ్లీ మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. అపరిమిత వెలుగులతో కూడిన అమెరికా భవిష్యత్ కోసం త్వరలోనే ఓ మంచి ప్రణాళికతో మీ ముందుకు వస్తాను’’ అని చెప్పారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదని ఆయన అన్నారు.

అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్ హింస విషయంలో ట్రంప్ పై సెనేట్ శనివారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వంద మంది సభ్యులున్న సభలో అభిశంసన నెగ్గాలంటే 65 శాతం మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, కేవలం 57 మంది సెనేటర్లే ట్రంప్ తప్పు చేశారంటూ ఓటేశారు. అందులో ఏడుగురు రిపబ్లికన్లూ ఉన్నారు. దీంతో అభిశంసన వీగిపోయింది.

More Telugu News