Corona Virus: టీకా తీసుకున్న 20 రోజుల తరువాత నిమ్స్, ఉస్మానియా డాక్టర్లకు కరోనా!

  • టీకా తరువాత నిబంధనలు పాటించని వైద్యులు
  • పేర్లను వెల్లడించని ఉన్నతాధికారులు
  • 42 రోజుల తరువాతే యాంటీ బాడీల వృద్ధి
  • అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలని వెల్లడి
Telangana Doctors Corona Positive after Taking Vaccine

కరోనా వ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు వైరస్ బారిన పడటం కలకలం రేపింది. నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్ ను తీసుకున్నారు.

కాగా, ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.

కాగా, ఇండియాలో వ్యాక్సినేషన్ గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే, రెండు డోస్ లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ టీకాల పంపిణీ  లక్ష్యాన్ని చేరుకోవడంలో హైదరాబాద్ చాలా వెనుకంజలో ఉండటం గమనార్హం.

More Telugu News