Ganta Srinivasa Rao: డ్రైవర్ కు ఘాట్ రోడ్డులో బస్సు నడిపే నైపుణ్యం లేదు... అందుకే ప్రమాదం!: గంటా

  • నిన్న రాత్రి అరకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • 80 అడుగుల ఎత్తు నుంచి పల్టీలు కొట్టిన బస్సు
  • నలుగురు అక్కడికక్కడే మృతి
  • తీవ్రగాయాలతో 20 మంది ఆసుపత్రిపాలు
  • కేజీహెచ్ లో క్షతగాత్రులను పరామర్శించిన గంటా
Ganta Srinivasarao visits Visakha KGH

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు 80 అడుగుల పైనుంచి లోయలోకి పల్టీలు కొట్టింది. కాగా, విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్ కు ఘాట్ రోడ్డులో బస్సు నడిపే నైపుణ్యం లేనందువల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బస్సు ఫిట్ నెస్ పైనా బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

అంతకుముందు, బస్సు డ్రైవర్ శ్రీశైలం మాట్లాడుతూ, ప్రమాదానికి కారణం బ్రేకులు ఫెయిల్ కావడమేనని వెల్లడించాడు. ఘాట్ రోడ్లపై తనకు పదేళ్ల అనుభవం ఉందని చెప్పాడు. బ్రేకులు ఫెయిలైనందువల్లే బస్సును అదుపు చేయలేకపోయినట్టు వివరించాడు.

కాగా, మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. హైదరాబాద్ షేక్ పేటకు చెందిన కొట్టం సత్యనారాయణ కుటుంబం ఈ నెల 10వ తేదీన దినేశ్ ట్రావెల్స్ కు చెందిన మినీ బస్సులో పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరింది. శుక్రవారం ఉదయం అరకు వెళ్లి ఎంతో ఉల్లాసంగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం డముకు వద్ద ఐదో నెంబరు మలుపు ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

More Telugu News