Jagan: ఉన్నత విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష... ప్రైవేటు వర్సిటీల చట్టంపై చర్చ

  • క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమావేశం
  • ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణపై చర్చ
  • అత్యుత్తమ ప్రమాణాలను అర్హతగా నిర్దేశించాలని సూచన
  • అర్హత ప్రమాణాలు అందుకుంటేనే అనుమతి ఇవ్వాలని స్పష్టీకరణ
CM Jagan reviews on AP Private Universities Act amendment

ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం-2006పై అధికారులతో చర్చించారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో చట్ట సవరణకు ప్రతిపాదన చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రాధాన్యతాంశమని పేర్కొన్నారు.

ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మార్చేవారికి, కొత్తగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్థాపించే వారికి అత్యుత్తమ ప్రమాణాలు నిర్దేశించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యాసంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ కలిగి ఉండి, ఐదేళ్లపాటు ఆ సర్టిఫికేషన్ ను నిలుపుకున్న విద్యాసంస్థలకే ప్రైవేటు వర్సిటీలుగా మారేందుకు అనుమతి ఇవ్వాలని వివరించారు. ప్రైవేటు వర్సిటీల్లో ప్రభుత్వ కోటా కింద 35 శాతం సీట్ల భర్తీ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం-2006కు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు.

ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Telugu News