Fire Accident: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం... 11 మంది మృతి

Fatal fire accident in Tamilnadu fireworks factory
  • విరుదునగర్ లో ఘటన
  • బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు
  • పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం
  • 36 మంది గాయపడిన వైనం
  • పరారీలో బాణసంచా కర్మాగారం యజమాని
  • ఘటనపై దిగ్భ్రాంతి చెందిన ప్రధాని మోదీ
తమిళనాడులో బాణసంచా కర్మాగారాలు అధికంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువే. తాజాగా విరుదునగర్ లోని అచంకుళం వద్ద ఓ బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కార్మికులు బాణసంచా తయారీలో ఉండగా, ఈ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. దాంతో ఆ కర్మాగారంలోని 4 షెడ్లకు మంటలు వ్యాపించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించారు. అప్పటికే భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా, పేలుడు జరిగిన వెంటనే కర్మాగారం యజమాని పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తమిళనాడు బాణసంచా పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, కర్మాగారం యజమాని భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు అంటున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారం మొత్తం నేలమట్టమైంది.
Fire Accident
Fire Works Factory
Virudunagar
Tamilnadu

More Telugu News