H1B Visa: భారతీయులకు కొత్తగా హెచ్1బీ వీసాలివ్వకండి: బైడెన్ ప్రభుత్వానికి ఇండియన్ గ్రూప్ విజ్ఞప్తి

Biden admin urged not to issue H1B to Indians till country cap on Green Card is remove
  • గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తేసేదాకా ఇవ్వకూడదన్న ఇమిగ్రేషన్ వాయిస్
  • ఇప్పటికే వేలాది మంది దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారు 
  • మళ్లీ కొత్తగా జారీ చేస్తే మరింత మంది పెరిగిపోతారని ఆందోళన
  • కంపెనీల దయాదాక్షిణ్యాల మీదే బతకాల్సి వస్తుందని కామెంట్
శాశ్వత నివాస హోదానిచ్చే గ్రీన్ కార్డులపై పరిమితిని ఎత్తేసేదాకా భారతీయులకు కొత్తగా హెచ్1బీ వీసాలను మంజూరు చేయొద్దంటూ ప్రముఖ ఇమిగ్రేషన్ స్వచ్ఛంద సంస్థ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు బైడెన్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. భారతీయ అమెరికన్లకు మద్దతుగా నిలుస్తున్న ఇమిగ్రేషన్ వాయిస్ అనే సంస్థ ఈ విజ్ఞప్తిని చేసింది.

గ్రీన్ కార్డులపై పరిమితి పెట్టడం వల్ల చాలా మంది వాటి కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయని, మళ్లీ కొత్తగా హెచ్1బీ వీసాలిస్తే ఆ జాబితాలో మరికొన్ని వేల మంది చేరిపోతారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 9 నుంచి ఆన్ లైన్ లో వీసాల దరఖాస్తుకు బైడెన్ అనుమతులిచ్చిన నేపథ్యంలో.. సంస్థ ఈ విధంగా స్పందించింది.

ఇప్పుడు కొత్తగా వీసాలు ఇవ్వడం వల్ల కొత్తగా 60 వేల మంది అనుకోకుండానే గ్రీన్ కార్డులకు బాధితులవ్వాల్సి వస్తుందని సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు. గ్రీన్ కార్డుల విషయాన్ని తేల్చకుండా ఎప్పటికప్పుడు హెచ్1బీ వీసాలను జారీ చేస్తూ పోతే.. కంపెనీల దయాదాక్షిణ్యాలమీదే ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు బతకాల్సి వస్తుందని అన్నారు. దాని వల్ల భవిష్యత్తులో నష్టం జరుగుతుందన్నారు.

కాగా, ఇమిగ్రేషన్ వాయిస్ లో లక్షా 30 వేల మంది భారతీయులు సభ్యులుగా ఉన్నారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తల వంటి వారున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయుల హక్కులపై సంస్థ పోరాడుతోంది.
H1B Visa
USA
Joe Biden
Immigration Voice
Green Card
India

More Telugu News