Kodali Nani: నిమ్మగ‌డ్డ‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య‌లు.. షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎస్ఈసీ

sec sends show cause notice to kokali nani
  • మంత్రి స్వ‌యంగా లేదా ప్ర‌తినిధి ద్వారా స‌మాధానం ఇవ్వాలి
  • లేదంటే ఆయ‌న‌పై  చర్యలు తీసుకుంటాం
  • ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయి
  • వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాలి
ఎస్ఈసీ నిమ్మగడ్డ ర‌మేశ్ కుమార్ పై ఏపీ మంత్రి కొడాలి నాని మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. మంత్రికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసింది.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్నాథ‌ రథ చక్రాల కింద పడి నలిగిపోతారనీ, తాము పనికిమాలిన మీడియాను నమ్ముకోలేదని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ విజయం సాధిస్తుంద‌ని మంత్రి కొడాలి నాని ఈ రోజు వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్‌ చిటికెనవేలిని కూడా ఎవ‌రూ తాక‌లేరంటూ, ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు.
 
దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీడియా ముందు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై  పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆయ‌న ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా కానీ, లేక త‌న‌ ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని పేర్కొంది. లేదంటే ఆయ‌న‌పై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా   ఉన్నాయ‌ని వ్యాఖ్యానించింది. అలాగే, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆదేశించింది.
Kodali Nani
YSRCP
Nimmagadda Ramesh Kumar

More Telugu News