చిరంజీవి, బాబీ సినిమా ఎలా ఉంటుందంటే..!

11-02-2021 Thu 16:28
  • బాబీ స్క్రిప్టుకు ఆమోదముద్ర వేసిన చిరంజీవి 
  • పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మాణం
  • ఘరానామొగుడు, గ్యాంగ్ లీడర్.. శైలిలో    
  • వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు
Chiranjeevis next will be full entertainer

తాజాగా 'ఆచార్య' సినిమాను పూర్తిచేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత మరో మూడు సినిమాలను వరుసగా చేయనున్నారు. వీటిలో ఒకటి మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ కాగా.. మరొకటి 'వేదాళం' తమిళ హిట్టుకి రీమేక్. ఇక మూడో చిత్రం బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందే సినిమా. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదు. స్ట్రెయిట్ సినిమా. దీనికి సంబంధించిన స్క్రిప్టుకు ఇటీవలే చిరంజీవి ఆమోదముద్ర వేశారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ అధినేతలు నవీన్, రవిశంకర్ ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్నారు. పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలిస్తూ 'ఉప్పెన' చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, బాబీ సినిమా గురించి కూడా వీరు మాట్లాడారు.

"కథ చాలా బాగా వచ్చింది. చిరంజీవిగారి ఇమేజ్ కి పెర్ఫెక్ట్ గా సరిపోయే కథ ఇది. ఫుల్ ఎంటర్ టైన్మెంటుతో సాగే పక్కా కమర్షియల్ సినిమా అవుతుంది. ఇంకా చెప్పాలంటే, గతంలో చిరంజీవిగారు చేసిన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రీ.. సినిమాల శైలిలో ఉంటుంది. అభిమానులకు, ప్రేక్షకులకు ఇది ఒక పండగ లాంటి సినిమా అవుతుంది" అని చెప్పారు.

ఇదిలావుంచితే, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక చిత్రాన్ని.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో మరో చిత్రాన్ని కూడా ఈ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. వీటికి సంబంధించిన పనులు కూడా మరోపక్క జరుగుతున్నాయి.