Narendra Modi: లోక్ సభలో మోదీ మాట్లాడుతుండగా... కాంగ్రెస్, టీఎంసీ వాకౌట్!

Congress and TMC walks out during Modis speech
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెపుతున్న సందర్భంగా గందరగోళం
  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
  • కాంగ్రెస్ ఒక గందరగోళ పార్టీ అన్న మోదీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

మోదీ తొలుత కరోనా గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నోటి వెంట 'రైతులు' అనే పదం వచ్చిన వెంటనే విపక్ష సభ్యులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... వాస్తవాలను తప్పుదోవ పట్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒక్క రైతు కూడా నష్టపోడని అన్నారు. దేశంలో ఒక్క మండీ కూడా మూతపడలేదని చెప్పారు.

కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత కనీస మద్దతు ధరను పెంచామని మోదీ తెలిపారు. రైతులు తమ ఉత్పాదనలను వారికి ఇష్టమైన చోట అమ్ముకోవచ్చని చెప్పారు. కొత్త మార్పులు ఎప్పుడూ అనుమానాలను రేకెత్తిస్తుంటాయని, ఇది సహజమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముక్కలైన పార్టీ అని... గందరగోళంలో మునిగిపోయిన పార్టీ అని విమర్శించారు. తనకు తానుగా ఆ పార్టీ ఈరోజు ఈ దుస్థితికి వచ్చిందని అన్నారు. గందరగోళంలో ఉన్న ఆ పార్టీ ఈ దేశానికి కానీ, ఏ ఒక్కరికి కానీ ఎలాంటి సాయం చేయలేదని ఎద్దేవా చేశారు. బయట అరుస్తున్న విధంగానే పార్లమెంటులో కూడా అరవాలనుకుంటే అరుచుకోవచ్చని మోదీ అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Narendra Modi
BJP
Congress
TMC
Parliament

More Telugu News