జీర్ణావస్థలో పాకిస్థాన్‌లోని ప్రాచీన హిందూ దేవాలయాలు

09-02-2021 Tue 09:49
  • దేవాలయాలను పరిరక్షించడంలో ఈటీపీవీ విఫలమైందన్న కమిషన్
  • ఆలయాల పునరుద్ధరణకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • పాక్‌లో మొత్తం 365 దేవాలయాలు
  • అధికారిక లెక్కల ప్రకారం పాక్‌లో 75 లక్షల మంది హిందువులు
Hindu Temples in Pakistan are in devastating stage
పాకిస్థాన్‌లోని పురాతన హిందూ దేవాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దేవాలయాలను పరిశీలించిన డాక్టర్ సొహైబ్ సుద్లే నేతృత్వంలోని కమిషన్ ఈ నెల 5న ఆ దేశ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. చారిత్రక ప్రాచీన ఆలయాలను సంరక్షించడంలో ఎవక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) పూర్తిగా విఫలమైందని నివేదికలో కమిషన్ ఆరోపించింది.

జీర్ణావస్థకు చేరుకున్న ఈ ఆలయాలను వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే, హిందూ, సిక్కు దేవాలయాల పరిరక్షణకు ఈటీపీబీ చట్టాల్లో సవరణలు చేయాలని పేర్కొన్న కమిషన్.. ఆలయాల పునరుద్ధరణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.

ఈటీపీబీ గణాంకాల ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 365 హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే, వీటిలో 13 ఆలయాలను మాత్రమే ఈటీపీబీ నిర్వహిస్తోంది. 65 ఆలయాలను హిందువులే నిర్వహిస్తున్నారు. మిగతావి కబ్జాకు గురయ్యాయి. ఇక, అధికారిక లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికశాతం మంది సింధ్ ప్రావిన్స్‌లోనే ఉన్నారు.