Vijayasai Reddy: కనకమేడలపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. ఘాటుగా బదులిచ్చిన టీడీపీ ఎంపీ

  • నియమాలను ఉల్లంఘించారంటూ విజయసాయి లిఖిత పూర్వక ఫిర్యాదు
  • ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్న వైసీపీ ఎంపీ  
  • పార్లమెంటును బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడ అన్న  కనకమేడల
YCP MP Vijayasai Complaint Against Kanakamedala to Venkaiah Naidu

టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ సభా నియమాలను ఉల్లంఘించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా కనమేడల చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమని విజయసాయి తన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ శాసనసభ, దాని కార్యకలాపాలపైనా, అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపైనా కనకమేడల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు ఇటీవల హోంమంత్రిని కలిసి ఏపీలో మతహింస జరుగుతోందని ఆరోపించారని, కాబట్టి కనకమేడల ప్రసంగాన్ని రాజకీయ కోణంలోనూ చూడాలని విజయసాయి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

విజయసాయి ఫిర్యాదుపై కనకమేడల కూడా అంతే తీవ్రంగా స్పందించారు. పార్లమెంటును బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడలో భాగంగానే విజయసాయి తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. తన ప్రసంగాన్ని సాకుగా తీసుకుని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలకు దిగారని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలి చైర్మన్ సహా ఎన్నికల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టులపైనా వ్యక్తిగత విమర్శలు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు పార్లమెంటును లక్ష్యంగా చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడినప్పుడు వైసీపీ సభ్యులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు విజయసాయి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని కనకమేడల ఎద్దేవా చేశారు.

More Telugu News