TSRTC: అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు... టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!

  • డీజిల్ బస్సులు విద్యుత్ బస్సులుగా మార్పు
  • ఓ ప్రైవేటు సంస్థతో ఇప్పటికే డీల్
  • ఏటా రూ. 2 వేల కోట్ల వరకూ ఆదా
TS to Convert Diesel Buses to Electric Buses

ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించేందుకు వినూత్న ప్రయోగం చేయాలని నిర్ణయించింది. ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం, బస్సులను ఎలక్ట్రిక్ మోడ్ లోకి మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చేందుకు ఓ ప్రైవేటు సంస్థతో డీల్ ను కూడా కుదుర్చుకుంది.

ఆ ప్రైవేటు సంస్థకు ఇప్పటికే ఓ డీజిల్ బస్సును కేటాయించింది. ఈ బస్సు డీజిల్ ఇంజన్ ను ఎలక్ట్రిక్ ఇంజన్ గా మార్చనున్న సంస్థ మూడు నెలల పాటు పనితీరును సమీక్షించనుంది. ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ వ్యయం, డీజిల్ బస్సు నిర్వహణా వ్యయంతో పోల్చి ఖర్చు తగ్గినట్టు తేలితే, మిగతా అన్ని బస్సులనూ మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

కాగా, ఈ ప్రయోగం విజయవంతం అయితే, ఒక్క హైదరాబాద్ రీజియన్ పరిధిలోనే డీజిల్ రూపేణా ఖర్చవుతున్న రూ. 460 కోట్ల భారం తగ్గుతుంది. ఇక రాష్ట్రంలో తిరుగుతున్న అన్ని బస్సులనూ విద్యుత్ బస్సులుగా మారిస్తే, దాదాపు 1,926 కోట్ల మేరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక బస్సులను కన్వర్ట్ చేసే ప్రక్రియ కారణంగా పడే భారాన్ని తప్పించుకునేందుకు కూడా అధికారులు ఓ ప్లాన్ వేశారు.

బస్సుల ఇంజన్ లను మార్చిన తరువాత, డీజిల్ ఖర్చులో మిగిలే మొత్తాన్ని సదరు సంస్థే తీసుకుంటుంది. ఐదేళ్ల పాటు ఆ సంస్థ ఈ మిగులు డబ్బు తీసుకుంటుంది. ఐదేళ్ల తరువాత బస్సులు ఆర్టీసీ పరం అవుతాయి. ప్రస్తుతం ఓ బస్సును ప్రయోగాత్మకంగా ఇచ్చినా, తదుపరి దశలో టెండర్లు పిలిచి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News