Vijay Khambe: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి... యువతి గట్టిగా పట్టుకోవడంతో కాలిన గాయాలతో నిందితుడి మృతి

Man set woman fire as the woman grabbed him led to die
  • ముంబయిలో ఘటన
  • యువతిని పెళ్లాడాలని భావించిన వ్యక్తి
  • అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు
  • యువతికి వేధింపులు
  • యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వ్యక్తి ఘాతుకం
ముంబయిలోని మేఘ్ వాడీ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి యువతిని చంపబోయి తానే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ కాంబే అనే వ్యక్తి ఇటీవల ఒక యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అగ్నికీలల్లో చిక్కుకున్నప్పటికీ ఆమె తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన విజయ్ కాంబేని గట్టిగా పట్టుకుంది. దాంతో అతడు కూడా మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్రస్థాయిలో కాలినగాయాలు కావడంతో విజయ్ కాంబే మరణించాడు. ఆ యువతి మాత్రం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆ యువతి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా విజయ్ కాంబేపై కేసు నమోదు చేశామని, అయితే అతడు ఈ ఘటనలో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, తద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాగా, మృతుడు విజయ్ కాంబే, యువతి గత రెండున్నరేళ్లుగా పరిచయస్తులేనని పోలీసులు చెబుతున్నారు.

విజయ్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడని, అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని వివరించారు. దాంతో కోపం పెంచుకున్న విజయ్ ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడని, ఫిబ్రవరి 6న యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఇరుగు పొరుగు వారు వారిద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ విజయ్ మరణించాడు. ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతోంది.
Vijay Khambe
Woman
Fire
Death
Mumbai

More Telugu News