saidi reddy: బండి సంజ‌య్ నాపై చేసిన‌ ఆరోప‌ణ‌లను నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి

  • గుర్రంబోడు భూముల‌పై ఆరోప‌ణ‌లు చేశారు
  • గిరిజనుల భూముల కబ్జా చేశానంటున్నారు
  • 540 సర్వే నంబర్ గురించి బీజేపీకి తెలుసా?
  • నాగార్జునసాగర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఆరోప‌ణ‌లు: సైదిరెడ్డి
saidi reddy condemns bandi sanjay allegations

నాగార్జునసాగ‌ర్ మఠంపల్లి మండలం గుర్రంబోడు సర్వే నంబర్‌ 540లోని భూములను ప్ర‌స్తావిస్తూ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తోన్న బీజేపీ నేత‌లపై హుజుర్‌న‌గ‌ర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గుర్రంబోడు తండాలో గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ వ‌స్తోన్న‌ ఆరోపణలను ఆయన ఖండించారు.

గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సైదిరెడ్డి అన్నారు. అసలు 540 సర్వే నంబర్ గురించి బీజేపీకి తెలుసా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం బీజేపీ డ్రామాలు ఆడుతోందని సైదిరెడ్డి
తెలిపారు. ‌గుర్రంబోడు తండాలో నిన్న బీజేపీ చేసిన‌‌ గిరిజ‌న భ‌రోసా యాత్ర ఓ వంచ‌న యాత్ర అని తెలిపారు. ఆ యాత్ర‌లో స్థానికులు ఎవ‌రూ లేరని, హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లే హంగామా చేశార‌ని చెప్పారు. అంతేగాక‌, వారు పోలీసుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని తెలిపారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్క‌డ‌ దొంగ ప‌ట్టాల‌ను ప్రోత్స‌హించారని ఆయ‌న ఆరోపించారు. దీంతో తాను ఈ ప్రాంతంలో గెలిచిన త‌ర్వాత ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. తాను హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ఇద్ద‌రు ఎమ్మార్వోలు స‌స్పెండ్ అయ్యారని చెప్పారు. బండి సంజ‌య్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న స‌వాలు విసిరారు.

More Telugu News