Lalitha: వ్యాక్సిన్ తీసుకున్న పలాస వలంటీర్ లలిత మృతి!

  • 5న టీకా తీసుకున్న లలిత
  • ఆపై జ్వరం, తలనొప్పి
  • పరిస్థితి విషమించి మరణం
  • రూ. 2 లక్షల సాయం ప్రకటించిన మంత్రి అప్పలరాజు
Volenteer of Palasa Died After Taking Vaccine

ఈ నెల 5వ తేదీన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పలాస వలంటీర్ లలిత తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించడం కలకలం రేపింది. టీకా తీసుకున్న తరువాత ఆమెకు జ్వరం, తలనొప్పి వచ్చాయి. ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మరికొంత మందిలో కూడా దుష్ప్రభావాలు కనిపించాయి. వారిని చికిత్స నిమిత్తం తరలించినా, లలిత పరిస్థితి విషమించింది. దీంతో 28 ఏళ్ల లలిత ఆదివారం నాడు కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, రిపోర్టు వచ్చిన తరువాతనే ఆమె మృతికి అసలు కారణం తెలుస్తుందని పలాస తహసీల్దారు పేర్కొన్నారు.

అయితే, టీకా వికటించడం వల్లే తమ బిడ్డ కన్నుమూసిందని లలిత తల్లిదండ్రులు వాపోయారు. పలాస మండలం రెంటికోటకు చెందిన 8 మంది వలంటీర్లతో పాటు వీఆర్వో ప్రసాద్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరందరిలోనూ స్వల్ప జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అందరూ ఇంట్లోనే ఉండి టాబ్లెట్లు వేసుకున్నారు. అయితే, లలిత పరిస్థితి మాత్రం విషమించిందని తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు. లలిత మృతితో తీవ్ర ఆందోళనకు గురైన ఇతర వలంటీర్లను, వీఆర్వోను పలాస పీహచ్ కి తరలించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు, లలిత కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 2 లక్షలు అందిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తన బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవని, టీకా తీసుకున్న తరువాత జ్వరం రాగా, పారాసిటమాల్ వేసుకోవాలని మెడికల్ సిబ్బంది చెప్పారని లలిత తల్లి పార్వతి పేర్కొంది. టీకా దుష్ప్రభావంతోనే తాము బిడ్డను కోల్పోయామని బోరున విలపించింది.

More Telugu News