Vijayashanti: ముఖ్యమంత్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం: విజయశాంతి

  • తన ఆరోగ్యం బాగానే ఉందన్న సీఎం కేసీఆర్
  • మరో పదేళ్లు తానే సీఎం అని స్పష్టీకరణ
  • స్పందించిన విజయశాంతి
  • తెలంగాణ రాష్ట్రమే అనారోగ్యం బారినపడిందని వ్యాఖ్యలు
  • మాయ మాటలు చెబుతున్నారని విమర్శలు
Vijayasanthi reacts to CM KCR latest statements

తన ఆరోగ్యానికేం ఢోకా లేదని, మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, సీఎం మార్పు అంటూ ప్రచారం చేయొద్దని సొంత పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ హితబోధ చేయడం తెలిసిందే. ఈ మేరకు మీడియాలో వస్తున్న కథనాలపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం అని వ్యాఖ్యానించారు. వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైందని విమర్శించారు. అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయని ఆరోపించారు.

సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తుండడంతో భయపడి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ మాయ మాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. మబ్బుల మాటున ఉండే వానాకాలపు సూర్యుడిలా మరో పదేళ్ల పాటు ఎప్పుడు ప్రగతిభవన్ లో కనిపిస్తాడో, ఎప్పుడు ఫాంహౌస్ లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంలో జనం తననే భరించాలని తన వ్యాఖ్యల ద్వారా హెచ్చరిస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.

"పదేళ్ల వరకు ఎందుకు... కేసీఆర్ కారు మబ్బుల్ని తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గరపడుతున్నాయి" అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

More Telugu News