Apple: ఆసియా అంటేనే బూతు అట.. ఆ పదాన్ని బ్లాక్​ లిస్టులో పెట్టిన 'యాపిల్'​!

  • సఫారీలో టైప్ చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టినట్టు సందేశం
  • ఐఫోన్, ఐప్యాడ్ లో ఏ బ్రౌజర్ ఉన్నా దానంతట అదే బ్లాక్ లిస్టులోకి
  • ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అని టైప్ చేసినా అంతే
  • ఆసియాతో పాటు మరిన్ని పదాలను ‘అడల్ట్ వెబ్ సైట్స్’తో లంకె పెట్టిన సంస్థ
  • 2019లోనే గుర్తించిన సంస్థ సాఫ్ట్ వేర్ డెవలపర్
  • అప్పుడే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందించని యాపిల్
APPLES ADULT FILTERS STOP IPHONE USERS GOOGLING THE WORD ASIAN

ఆసియా అంటే ఏంటని అడిగితే.. టక్కున అదో ఖండం అని సమాధానం చెబుతాం. అందులోని దేశాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను వివరిస్తాం. కానీ, అదేంటో యాపిల్ సంస్థకు అదో పెద్ద బూతు పదంలా కనిపిస్తోంది. ఆసియా అన్నా.. ఆ పదంతో కలిపి వేరే పదాలున్నా బ్లాక్ చేసేస్తోంది.  

ఉదాహరణకు మీరు ఐఫోన్, ఐప్యాడ్ లోని సఫారీ బ్రౌజర్ లో ఏషియన్ అని టైప్ చేశారనుకోండి.. బ్లాక్ చేసినట్టు ఓ సందేశం దర్శనమిస్తుంది. అదే కాదు.. ఏషియన్ ఫుడ్ అని రాసినా, ఏషియన్ డైనాస్టీస్ అని పదం టైప్ చేసినా అదే పునరావృతం అవుతుంది. అంతెందుకు, హైదరాబాద్ లో ఉన్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నా ఐఫోన్ సఫారీలో కుదరదు. ఎందుకంటే అందులో ‘ఏషియన్’ ఉంది కదా!

సఫారీలో రావట్లేదు కదా అని గూగుల్ క్రోమ్ లో టైప్ చేద్దామని చూస్తారా.. అక్కడా వెంటనే ఆ పదాలను బ్లాక్ చేస్తోంది యాపిల్. ఆ రెండే కాదు.. ఐఫోన్ లో ఏ బ్రౌజర్ ఉన్నా కూడా అవి తెరుచుకోవట్లేదు. అన్నింట్లోనూ ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఐవోస్ 12 సాఫ్ట్ వేర్ లోని ‘కంటెంట్ ఫిల్టర్’ అనే ఓ కొత్త ఫీచర్ వల్లే ఇది జరుగుతోంది. కంటెంట్ ఫిల్టర్ లో ‘అడల్ట్/పోర్న్ వెబ్సైట్స్’పై ఆంక్షలు పెడితే.. ‘ఆసియా’ అనే పదం ఉండే విషయాలూ బ్లాక్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటిదాకా యాపిల్ సంస్థ స్పందించనూ లేదు.

ఆసియా ఒక్కటే కాదు.. ‘బ్లాక్’, ‘వైట్’, ‘అరబ్’, ‘కొరియన్’, ‘ఫ్రెంచ్’, ‘స్కూల్ గర్ల్’ వంటి పదాలనూ యాపిల్ బ్లాక్ లిస్టులో పెట్టింది. నిజానికి ఈ సమస్యను స్టీవెల్ షెన్ అనే డెవలపర్.. 2019 డిసెంబర్ లోనే దీనిని గుర్తించి, సంస్థకు నివేదించారు. అయితే, అతడి అభ్యర్థనను యాపిల్ పట్టించుకోలేదు. ఇప్పటికీ స్పందించలేదు. అయితే, యాపిల్ కంప్యూటర్ మ్యాక్ లో మాత్రం ఈ సమస్య లేదు.

More Telugu News