Farm Laws: చక్కా జామ్​: సైన్యం నీడన ఢిల్లీ.. భారీగా బలగాల మోహరింపు

Entry and exit gates of 10 metro stations shut in Delhi in view of Chakka Jam 50000 CRPF personnel depolyed
  • పోలీసులకు తోడు 50 వేల పారామిలటరీ బలగాల గస్తీ
  • సరిహద్దుల్లో బారికేడ్లు, వాటర్ కెనాన్ల ఏర్పాటు
  • ఎర్రకోటకు వెళ్లే దారులన్నీ మూసివేత
  • 10 మెట్రో స్టేషన్లను బంద్ చేసిన ఢిల్లీ మెట్రో
రైతుల చక్కా జామ్ (రాస్తారోకో) నేపథ్యంలో బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులకు తోడుగా 50 వేల మందికిపైగా పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఎక్కడికక్కడ పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఘాజీపూర్, టిక్రీ, సింఘూ సరిహద్దుల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. టిక్రీ వద్ద దాదాపు 20 వరుసల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలు, సిమెంటు దిమ్మెలు అడ్డుగా పెట్టారు. అనివార్య ఘటనలు జరిగితే అదుపు చేసేందుకు వాటర్ కెనాన్లను సిద్ధం చేసి పెట్టారు. ఎర్రకోటకు వెళ్లేదారులన్నింటినీ మూసేశారు.

ఐటీవో పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులన్నింటి వద్ద బలగాలను మోహరించారు. రోడ్ నంబర్ 56, జాతీయ రహదారి 24, వికాస్ మార్గ్, జీటీ రోడ్, జీరాబాద్ రోడ్ ల వద్ద పహారా కాస్తున్నారు. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

వదంతులకు చెక్ పెట్టేందుకు సామాజిక మాధ్యమాలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు 10 మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. మండీ హౌస్, ఐటీవో, ఢిల్లీ గేట్, విశ్వవిద్యాలయ స్టేషన్, లాల్ ఖిల్లా, జామా మసీదు, జన్ పథ్, సెంట్రల్ సెక్రటేరియట్, ఖాన్ మార్కెట్, నెహ్రూ ప్లేస్ స్టేషన్లను మూసేస్తున్నట్టు తెలిపింది.
Farm Laws
New Delhi
Chakka Jam
CRPF
RedFort

More Telugu News