Tonsure: ప్రసాద్ అదృశ్యం వెనక పక్కా ప్లాన్: డీఎస్పీ వెంకటేశ్వరరావు

  • ఉద్దేశపూర్వకంగానే అదృశ్యమయ్యాడన్న డీఎస్పీ
  • పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
  • రెండు చోట్ల దాక్కున్నట్టు వెల్లడి
There is plan behind Prasad Disappear says DSP

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ (23) అదృశ్యం వెనక పక్కా ప్లాన్ ఉందని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ప్రసాద్ ఉద్దేశపూర్వకంగానే అదృశ్యమయ్యాడని, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గందరగోళం సృష్టించడంతోపాటు పోలీసులను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే అతడు అదృశ్యమైనట్టు చెప్పారు.

ఫోన్‌ను, బైక్‌ను ఇంటి వద్దే వదిలేసి వెళ్లిన ప్రసాద్.. వెళ్తూవెళ్తూ తన గురించి ఇతరులకు ఏం చెప్పాలనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడని డీఎస్పీ తెలిపారు. తొలుత మల్లయ్యపేటలో దాక్కున్నాడని, ఆ తర్వాత కాకినాడలోని అచ్చంపేటలో బంధువుల ఇంటికి చేరుకున్నాడని పేర్కొన్నారు.  ప్రసాద్, అతడి స్నేహితులు తీసుకెళ్లిన బైక్ పాడైపోవడంతో బాగు చేయించేందుకు అచ్చంపేట పోలీస్ క్వార్టర్స్ వద్దకు రాగా అతడిని అరెస్ట్ చేసినట్టు వివరించారు.

గ‌త ఏడాది జులైలో ప్రసాద్‌ను అప్పటి ఎస్సై ఫిరోజ్ పోలీస్ స్టేషన్‌లో‌ శిరోముండనం చేయించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. త‌న‌కు శిరోముండనం చేయ‌డం ప‌ట్ల కొంద‌రు మాటలతో వేధిస్తున్నారని ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌తో చెబుతుండే వాడు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లు  ఆయ‌న భార్య చెప్పింది. సెల్‌ఫోన్‌, మోటార్‌ సైకిల్ ను ఇంటి వద్దనే వదిలి వెళ్లిపోయిన‌ ప్రసాద్ ఆచూకీ చివరికి లభించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.  

More Telugu News