Nominations: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించాం: ఎస్ఈసీ

SEC tells how many first phase nominations were rejected
  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • తొలి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి
  • కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,125 నామినేషన్ల తిరస్కరణ
  •  2,245 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణ
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు ముగిసింది. ఈ నేపథ్యంలో, అనర్హతకు గురైన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పలువురు సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

సర్పంచ్ పదవి కోసం మొత్తం 19,491 నామినేషన్లు దాఖలయ్యాయని, అందులో 2,386 నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయని వివరించింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 1,125 నామినేషన్లు తిరస్కరించినట్టు తెలిపింది. ఆ జిల్లాలో 193 పంచాయతీలకు 1,243 నామినేషన్లు రాగా, వాటిలో కేవలం 118 నామినేషన్లే అర్హత పొందాయని వెల్లడించింది.

ఇక,  చిత్తూరు 349, విశాఖ 152, తూర్పు గోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కడప 54, పశ్చిమ గోదావరి 52, నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఓ ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు వచ్చాయని, వాటిలో 2,245 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు.
Nominations
Gram Panchayat Elections
First Phase
SEC
Andhra Pradesh

More Telugu News