Nirmala Sitharaman: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.05 లక్షల కోట్ల అప్పు చేస్తాం: నిర్మలా సీతారామన్

  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 34.83 లక్షల కోట్ల వ్యయం
  • ద్రవ్యలోటును పూడ్చేందుకు మార్కెట్ల నుంచి రుణాలు
  • పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు
Rs 12 lakh crore debt in coming financial year

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నిన్నటి తన బడ్జెట్ ప్రసంగంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.05 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనా రూ. 12.80 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనా రూ. 7.8 లక్షల కోట్ల కంటే ఇది 64 శాతం అధికమని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 34.83 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో రూ. 5.56 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయమని తెలిపారు. ద్రవ్యలోటును పూడ్చేందుకు మార్కెట్ల నుంచి ప్రభుత్వం రుణాలు స్వీకరిస్తుందని మంత్రి వివరించారు.

అలాగే, 15వ ఆర్థిక కమిషన్ ప్రతిపాదనల మేరకు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటా లభిస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్ పద్ధతిలో వ్యాపారాలు నిర్వహించే రూ. 10 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ట్యాక్స్ ఆడిట్ పరిమితి మినహాయింపును రెట్టింపు చేస్తామని నిర్మల వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 6.8 శాతం నమోదయ్యే అవకాశం ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి దీనిని 4.5 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

More Telugu News