Vaccination: భారత్‌లో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్.. రికార్డు స్థాయిలో టీకాలు!

vaccination drive in India reach 37 lakh land mark
  • అత్యంత వేగంగా 10, 20, 30 లక్షల కరోనా టీకా లక్ష్యాలను చేరుకున్న భారత్
  • గత రాత్రి నాటికి 37,01,157 టీకా
  • అత్యధిక మందికి టీకాలు వేసిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అత్యంత వేగంగా టీకాలు వేస్తున్న దేశంగా రికార్డులకెక్కింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన 17 రోజుల్లోనే ఏకంగా 37 లక్షల మందికి పైగా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. అతి తక్కువ సమయంలోనే 10, 20, 30 లక్షల కరోనా టీకా లక్ష్యాలను చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశవ్యాప్తంగా కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య గత రాత్రి నాటికి 37,01,157కు చేరుకున్నట్టు తెలిపింది.

10 లక్షల మందికి టీకా వేసేందుకు అమెరికాకు 10 రోజులు, బ్రిటన్‌కు 18 రోజులు అవసరం కాగా భారత్ ఆరు రోజుల్లోనే ఆ ఘనత సాధించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో దాదాపు రెండు నెలల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, భారత్‌లో మాత్రం ఈ నెల 16న ప్రారంభమైంది. దేశంలోని 71 ప్రదేశాల్లో టీకాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4,63,793 మందికి టీకాలు వేయగా, 3,26,745 మందితో రాజస్థాన్ ద్వితీయ స్థానంలో ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Vaccination
Corona Virus
Uttar Pradesh
India

More Telugu News