Pawan Kalyan: నాకు నా కులం ఎక్కువ కాదు, మిగతా కులాలు తక్కువా కాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan held meeting with Kapu Samkshema Sena leaders
  • కాపు సంక్షేమ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ
  • తనకు అన్ని కులాలు సమానమేనని స్పష్టీకరణ
  • అన్ని కులాల సమస్యలపై పోరాడతానని వెల్లడి
  • కార్పొరేషన్ల ఏర్పాటు ఓ కుట్ర అంటూ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ప్రత్యేకించి ఒక కులానికి ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. తాను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు తనకు సమానమేనని అన్నారు. తనను ఓ కులానికి కట్టేయాలని చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తానని, అన్ని కులాల సమస్యలపై పోరాడే వ్యక్తిని తానని వివరించారు. 'నాకు నా కులం ఎక్కువ కాదు, మిగతా కులాలు తక్కువ కాదు' అని తెలిపారు.

ఉద్దానంలో కిడ్నీ సమస్య కానివ్వండి, అమరావతిలో దళితరైతుల కోసం చేసిన పోరాటం కానివ్వండి.. అక్కడా, ఇక్కడా నేనే. నేను కులం చూడను... అని స్పష్టం చేశారు. అంతేకాదు, వివిధ కులాలకు ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై పవన్ కల్యాణ్ భిన్నంగా స్పందించారు.

ఆయా కులాలను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసే చర్యల్లో భాగంగానే కార్పొరేషన్ల ఏర్పాటు అని విమర్శించారు. ఓ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇక ఆ కులం వారందరూ ఆ కార్పొరేషన్ పరిధిలోనే కొట్టుకుంటుంటారని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే ఓ కులం వారికి రాజకీయ సాధికారతను దూరం చేసే పన్నాగమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ ఉపాధి కల్పించడం తప్ప మరే విధంగానూ కార్పొరేషన్లు ఉపయుక్తంకాదని వివరించారు.

ఇక కాపుల గురించి మాట్లాడుతూ... 27 శాతంగా ఉన్న కాపులను ప్రతి పార్టీ కూడా ఓటు బ్యాంకుగా చూడడం మానేయాలని అన్నారు. ఎప్పటికీ ఓటు బ్యాంకుగానే ఉండిపోతే కాపులు శాసించే శక్తిని కోల్పోతారని, యాచించడమే మిగులుతుందని విశ్లేషించారు. నేతలు మీ వద్దకే వచ్చేలా పరిస్థితులు ఉండాలే తప్ప, మీరు వాళ్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు. జగన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా ఎవరికీ మినహాయింపు లేదని, కాపుల వద్దకే నేతలు వచ్చేలా ఉండాలని అభిలషించారు.

కాపులను ఎన్నికలప్పుడు ముడిసరుకుగా వాడుకుని వదిలేస్తున్నారే తప్ప, రాజకీయ సాధికారత కల్పించడం లేదని ఆరోపించారు. టీటీడీలో 20 మంది సభ్యులుంటే ఒక్కరు కూడా కాపు వ్యక్తి లేరని హరిరామజోగయ్య వంటి పెద్దలు చెబుతున్నారని పవన్ వివరించారు.
Pawan Kalyan
Kapu
Cast
Janasena
Andhra Pradesh

More Telugu News