New Delhi: నేడు రైతుల మహా పంచాయతీ... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం!

  • ఢిల్లీ సరిహద్దుల్లో రాకపోకల పునరుద్ధరణ
  • ఇంకా ఉద్రిక్తంగానే యూపీ సరిహద్దు
  • చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనంటున్న రైతులు
Today Farmers Maha Panchayat

సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలంటూ దాదాపు మూడు నెలలుగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను వ్యక్తం చేస్తున్న రైతులు, నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నేడు రైతుల మహా పంచాయతీ జరుగనుండగా, ఇందులో పాల్గొననున్న రైతు సంఘాల నేతలు, తదుపరి తమ కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయమై ఓ అవగాహనకు రానున్నారు.

 నాలుగు రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అవాంఛనీయ కార్యకలాపాలను చర్చిస్తూనే, చట్టాల రద్దుకై కొనసాగించాల్సిన ఆందోళనపైనా వీరు చర్చించనున్నారు. 

ఇదిలావుండగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల నుంచి కొంతమంది రైతు నిరసనకారులు తరలివెళ్లారు. యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద మాత్రం ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఘాజీపూర్ నుంచి హస్తినకు వచ్చే జాతీయ మార్గం మినహా మిగతా అన్ని మార్గాల్లోనూ వాహనాల రాకపోకలను పునరుద్ధరించామని పోలీసు అధికారులు తెలిపారు. యూపీ సరిహద్దుల్లో మాత్రం రైతులు వెనక్కు మళ్లలేదని తెలుస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో తాము ఎటువంటి హింసకూ దిగడం లేదని, శాంతియుతంగానే సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ తెలిపారు.

సింఘూ సరిహద్దుల వద్ద జేసీబీ మెషీన్ లతో రోడ్డుపై గుంతలు చేయడంతో వాహనాలకు అంతరాయం కలుగుతోందని, మరమ్మతు పనులను నేడు చేపట్టనున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఉద్యమంలో ఉన్న రైతులకు మంచి నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలను అధికారులు తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, సాంకేతిక కారణాల ద్వారానే నీటి సరఫరా జరగలేదని, ప్రస్తుతం పునరుద్ధరించామని అధికారులు అంటుండటం గమనార్హం.

ఢిల్లీ - హర్యానా సరిహద్దుల విషయానికి వస్తే, ఇక్కడ కొన్ని వందల మంది రైతులు ఇంకా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ నిరసనలను నీరుగార్చేందుకు బీజేపీయే కొన్ని అసాంఘిక శక్తులకు రైతు ముసుగులు వేసి, తమలో కలిపి విధ్వంసానికి దిగేలా చేసిందని ఆరోపిస్తున్నారు. రైతులంతా రెండున్నర నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాయని వ్యాఖ్యానించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఇప్పుడు పరిస్థితి మారిందంటే, అందుకు ప్రభుత్వమే కారణమని విమర్శించింది.

More Telugu News