apple: ఇండియాలో రెట్టింపయిన యాపిల్ వ్యాపారం: టిమ్ కుక్

  • డిసెంబర్ త్రైమాసికాల్లో పెరిగిన విక్రయాలు
  • యాపిల్ ఆదాయం 111 బిలియన్ డాలర్లకు పైనే
  • విదేశాల నుంచే అధిక ఆదాయం పొందుతున్నామన్న టిమ్
Apple Business Doubbled in India

భారత మార్కెట్ తమకు ఎంతో ముఖ్యమైనదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఇటీవల తాము ప్రారంభించిన ఆన్ లైన్ స్టోర్ సాయంతో విక్రయాలు గణనీయంగా పెరిగాయని, ముఖ్యంగా డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో భారత్ లో యాపిల్ మార్కెట్ వాటా రెట్టింపయిందని ఆయన తెలిపారు. ఇండియాలోని ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ లో వన్ ప్లస్, శాంసంగ్ లతో తాము పోటీ పడుతున్నామని తెలిపారు.

సంస్థ ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన ఆయన, డిసెంబర్ త్రైమాసికంలో తాము రికార్డు స్థాయిలో 111.4 బిలియన్ డాలర్ల ఆదాయం పొందామని, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 21 శాతం వృద్ధి నమోదైందని అన్నారు. అమెరికాకన్నా విదేశీ మార్కెట్ నుంచే అధిక ఆదాయం వచ్చిందని, వివిధ దేశాల్లో వ్యాపారం ద్వారా 64 శాతం ఆదాయం పొందామని ఆయన అన్నారు.

ఇండియా వంటి దేశాల్లో ఉన్న అపారమైన అవకాశాలతో పోలిస్తే, ఇప్పటికీ వ్యాపారం తక్కువగానే ఉందని, సమీప భవిష్యత్తులో తమ బిజినెస్ ను మరింతగా పెంచుకుంటామన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, గత సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ మధ్య యాపిల్ విక్రయాలు 171 శాతం పెరిగినట్టు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆన్ లైన్ స్టోర్ల ఏర్పాటుతో పాటు ఐఫోన్ 12 మార్కెట్లోకి రావడం, ఐఫోన్ 11పై ఆఫర్లు అమ్మకాలను పెంచాయి.

More Telugu News