Atchannaidu: అసలు నాకూ, ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా?: అచ్చెన్నాయుడు

  • నంది విగ్రహం కేసులో అచ్చెన్నాయుడుకు నోటీసులు
  • డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు
  • మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై ఆగ్రహం
  • హిందూ మతానికి అపచారం అంటున్నారని మండిపాటు
  • అక్కడున్నదంతా హిందువులేనని వెల్లడి
  • అపచారం ఎలా జరుగుతుందన్న అచ్చెన్న
Atchannaidu attends police inquiry in Nandi statue case

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నంది విగ్రహం కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసుల ఎదుట హాజరయ్యారు. డీఎస్పీకి తన వివరణ తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుకు, తనకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. తనకు ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోతే ఎలా కేసు నమోదు చేస్తారని మండిపడ్డారు.

"అసలు వీళ్లకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? కేసు ఎవరిమీద పెట్టాలి? వీళ్లు ఎవరి మీద పెట్టారు? అక్కడున్న కమిటీ నందికి పూజ చేసి అక్కడున్న దిమ్మె మీద పెడితే వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ దిమ్మెను పగులగొట్టి, దానిపై ఉన్న నందిని తొలగించి దేవుడికి అపచారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలి.

 హిందూ ధర్మానికి అపచారం జరిగిందంటున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసిన వాళ్లకు బుద్ధి లేకపోతే, ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసులకైనా జ్ఞానం ఉండక్కర్లేదా? హిందూ మతానికి ఎప్పుడు అపచారం జరుగుతుందంటే అక్కడ రెండు మతాలు ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరిగితే అప్పుడు అపచారం జరుగుతుంది. అక్కడున్నవాళ్లంతా హిందువులే అయితే హిందూ మతానికి అపచారం ఏవిధంగా జరుగుతుంది? కానీ అక్కడ మతాల మధ్య గొడవ అని, కులాల మధ్య వివాదం అని కేసు పెట్టారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా" అని అచ్చెన్నాయడు వ్యాఖ్యానించారు.

More Telugu News