Ration: ఏపీలో 'ఇంటికే రేషన్'... పాత పథకమా? కొత్తదా?: ఆరా తీసిన ఎస్ఈసీ

  • ఏపీలో తొలి దశ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు
  • జగన్ పోస్టర్లు కనిపించకుండా స్టిక్కర్లు వేస్తున్నాం
  • ఇంటికే రేషన్ పాత పథకమే
  • ఈసీకి స్పష్టం చేసిన పౌర సరఫరాల శాఖ
Nimmagadda Enquiry on Ration Home Supply in AP

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఇప్పటికే కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రేషన్ సరకులను ఇంటికే పంపించే విధానంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరా తీస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇది కొత్త పథకమా? లేక పాత పథకమా? అన్న విషయమై వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ, పౌర సరఫరాల అధికారులను వివరణ కోరింది. దీనిపై వెంటనే వివరణ పంపిన అధికారులు, ఈ పథకాన్ని సెప్టెంబర్ 2019లోనే పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినందున ఇది పాత పథకమేనని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రేషన్ సరకులను డోర్ డెలివరీ చేస్తున్న వాహనాలపై సీఎం వైఎస్ జగన్ ఫొటో స్టిక్కర్లు ఉండటంపై వివరణ కోరగా, అవి కనిపించకుండా స్టిక్కర్లు అతికిస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, కొత్త పథకాలు, ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇవ్వాలంటే తమ అనుమతి తప్పనిసరని, ఇదే సమయంలో పాత పథకాలను మాత్రం కొనసాగించ వచ్చని  ఎస్ఈసీ స్పష్టం చేసింది.

ఇదిలావుండగా, రేపటి నుంచి ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకూ తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ దాఖలుకు అవకాశం ఉంటుంది. ఆపై ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, 9న పోలింగ్ జరుగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి.

More Telugu News