మీపై అరెస్ట్ వారెంట్ ఎవరు జారీ చేస్తారు?: కర్ణాటక సీఎం యడియూరప్పకు సుప్రీంకోర్టు ప్రశ్న

28-01-2021 Thu 08:55
  • 2011 నాటి కేసులో హైకోర్టు విచారణ
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని యడియూరప్ప పిటిషన్
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే
Who Will Give Arrest Warrent Against You Supreem Asks Karnataka CM

2011లో ఓ ప్రైవేటు ఇన్వెస్టర్ కు ఇచ్చిన 26 ఎకరాల భూమిని తిరిగి వెనక్కు తీసుకోవడంపై నాటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీదట ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో యడియూరప్ప తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

కేసులో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, "మీరు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి. మీపై అరెస్ట్ వారెంట్ ను ఎవరు జారీ చేయగలరు? మహా అయితే ఓ రిక్వెస్ట్ ను మాత్రం మీ ముందు ఉంచగలరంతే" అంటూనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేందుకు మాత్రం అత్యున్నత ధర్మాసనం అంగీకరించలేదు.

ఈ కేసులో యడియూరప్పపై ఫోర్జరీ అభియోగాలు కూడా నమోదై ఉన్నాయి. ఆయనతో పాటు మాజీ ముఖ్య కార్యదర్శి వీపీ బాలిగర్, కర్ణాటక ఉద్యోగ్ మిత్ర మాజీ ఎండీ మిత్రా శివస్వామిలపైనా కేసులు నమోదయ్యాయి.