Red Fort: ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్... ఊరొదిలి పారిపోయిన తల్లిదండ్రులు!

Red Fort Flag Hoister Parents Flee from Village
  • మూడు రోజుల క్రితం ఎర్రకోటపై ఎగిరిన ఖల్సా జెండా
  • జుగ్రాజ్ కష్టపడే యువకుడంటున్న గ్రామస్థులు
  • అతనిపై కేసు రిజిస్టర్ చేశామన్న పోలీసులు
మూడు రోజుల క్రితం న్యూఢిల్లీలోని ఎర్రకోటపైకి ఎక్కి, అక్కడ ఖల్సా జెండాను ఎగురవేసింది జుగ్రాస్ సింగ్ అని పోలీసులు గుర్తించడంతో, వారి నుంచి వేధింపులు ఉండవచ్చన్న ఆందోళనతో అతని తల్లిదండ్రులు పంజాబ్ లోని తమ గ్రామాన్ని వదిలి పారిపోయారు. అయితే, తమతో పాటు ఉన్న ఇద్దరు వృద్ధులను మాత్రం వారు తీసుకెళ్లలేదు. వాంతారా సింగ్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల జుగ్రాజ్, ఎర్రకోట పై భాగానికి చేరుకుని అక్కడ ఖల్సా జెండాను ఎగురవేశాడు.

ఇక, ఆ గ్రామంలోని జుగ్రాజ్ ఇంటిలో ఇప్పుడు అతని తాతయ్య మెహాల్ సింగ్, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. పోలీసులు ఇప్పటికే ఆ ఇంటిపై పలుమార్లు దాడులు చేశారు. వారికి జుగ్రాజ్ ఇంట ఎటువంటి అనుమానాస్పద వస్తువులూ లభించలేదని గ్రామస్థులు వెల్లడించారు. ఇక తన మనవడి చర్యలపై మేహుల్ మాట్లాడుతూ, "ఈ ఘటన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు. జుగ్రాజ్ చాలా మంచివాడు" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఎర్రకోటపై జెండా ఎగురవేసిన దృశ్యాలను తాము టీవీల్లో మాత్రమే చూశామని ఆ గ్రామస్థులు అంటున్నారు.

జుగ్రాజ్ చాలా కష్టపడి పనిచేసే యువకుడని, అయితే, అతను చేసిన పని దురదృష్టకరమని, ఎవరో ప్రేరేపించి, అతని చేతికి జెండా ఇచ్చి ఎర్రకోటను ఎక్కించారని భావిస్తున్నామని ప్రేమ్ సింగ్ అనే జుగ్రాజ్ పొరుగింటి వ్యక్తి వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం జుగ్రాజ్ పై కేసును రిజిస్టర్ చేశామని, అతని ఆచూకీ ఇంకా దొరకలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతను వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని పంజాబ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Red Fort
Jugraj Singh
Khalsa Flag
Punjab

More Telugu News