సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'!

27-01-2021 Wed 21:20
  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో 'సలార్'
  • హైదరాబాదులో లాంఛనంగా మొదలైన షూటింగ్
  • రామగుండం వద్ద తొలి షెడ్యూలు  ప్లానింగ్
  • పదిరోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్  
Prabhas Salar shoot in Singareni open cost area

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచాడు. 'రాధే శ్యామ్' తర్వాత ఒక్కసారిగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' ఒకటి. మాఫియా నేపథ్యంలో పూర్తి యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.

దీంతో ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలెట్టడానికి ప్లానింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూలును తెలంగాణలోని రామగుండం, సింగరేణి ఓపెన్ కాస్ట్ నేపథ్యంలో చేయడానికి నిర్ణయించారని తెలుస్తోంది. సింగరేణి ఓసీపీ-2లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇందుకోసం తమ షూటింగుకి అవసరమైన విధంగా అక్కడ సెట్స్ కూడా వేస్తున్నారట. పది రోజుల పాటు ఈ షెడ్యూలు జరుగుతుందనీ, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు.

ఈ చిత్రంలో కీలకమైన విలన్ పాత్రను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి పోషించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కథానాయిక పాత్రకు మాత్రం ఇంకా ఎవరూ ఖరారు కాలేదని, శ్రుతి హాసన్ పేరును ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఓ భారీ యాక్షన్ ఫిలిం మాత్రం రానుంది.