Air Pollution: కడుపులో బిడ్డకు పొగబెడుతున్న వాయు కాలుష్యం.. 29% అబార్షన్లు దాని వల్లే!

Air pollution behind increased risk of pregnancy loss in India
  • కాలుష్యంతో ఏటా 3,49,681 గర్భ విచ్ఛిత్తి కేసులు
  • అబార్షన్లు ఏటా 7 శాతం చొప్పున పెరుగుదల
  • భారత్ లోనే ఎక్కువ.. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
వాయు కాలుష్యం కడుపులో ఉన్న బిడ్డకు పొగ పెడుతోంది. భూమి మీదికి రాకుండా ఉసురు తీస్తోంది. గర్భ విచ్ఛిత్తికి కారణమవుతోంది. తల్లులకు కడుపు కోత మిగుల్చుతోంది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

2000–2016 మధ్య వాయు కాలుష్యం వల్ల ఏటా సగటున 3,49,681 అబార్షన్లు జరిగాయని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. ఈ కాలంలో ఏటా జరుగుతున్న అబార్షన్లలో వాయు కాలుష్యం వల్ల అవుతున్న అబార్షన్లు 7 శాతం చొప్పున పెరిగాయని నిర్ధారించారు. డబ్ల్యూహెచ్ వో నిర్దేశాల ప్రకారం కాలుష్యకారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు.

అయితే, దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. 10 మైక్రోగ్రాములు దాటాక.. పెరిగే ప్రతి పాయింట్ కు 3 శాతం మేర అబార్షన్లు పెరుగుతున్నాయని తేల్చారు. పట్టణ ప్రాంతాల్లోని యువ తల్లులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద వయసు మహిళలకే దీని ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో అబార్షన్లు జరిగిన 34,197 మంది మహిళల డేటా తీసుకుని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మన దేశంలోనే ఎక్కువగా 77 శాతం మేర వాయు కాలుష్యంతో గర్భ విచ్చిత్తులు జరిగాయని తేల్చారు. తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం మేర అబార్షన్లు అయ్యాయని గుర్తించారు.
Air Pollution
Pregnancy
Abortion

More Telugu News