Twitter: ఫేక్​ న్యూస్​ పై పోరుకు ట్విట్టర్​ ‘బర్డ్​ వాచ్​’.. కొత్త వెబ్​ సైట్​ ప్రారంభం!

  • పైలట్ ప్రాజెక్టుగా అమెరికాలో ప్రారంభం
  • త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి
  • లోపాలుంటే సరిచేసుకుంటామన్న ట్విట్టర్
Twitter launches new website to fight fake news

ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ బాగా పెరిగిపోయింది. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా గ్రూపుల్లో ఫేక్ న్యూస్ ను షేర్ చేస్తున్నారు. చాలా మంది అది నిజమేనని నమ్మేసి చెక్ చేసుకోకుండానే ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ బెడదను తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలూ అంతగా విజయవంతం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఫేక్ న్యూస్ పై పోరాడేందుకు ‘బర్డ్ వాచ్’ అనే సరికొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది.

ట్విట్టర్, ఫేస్ బుక్ లేదా వాట్సాప్ లలో వచ్చిన సమాచారం ఫేక్ అనిపిస్తే.. దానిని చెక్ చేసుకునేలా బర్డ్ వాచ్ సైట్ ను ట్విట్టర్ ఆరంభించింది. ప్రస్తుతానికి దీనిని అమెరికాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్) కీత్ కోల్ మాన్ చెప్పారు. సైట్ లో ఇతరులు పెట్టిన నోట్స్ ఎంత వరకు సాయపడుతోందో కూడా రేటింగ్ ఇవ్వొచ్చని అన్నారు.

నిపుణులు, పరిశోధకులు, ప్రజలు.. బర్డ్ వాచ్ ను విశ్లేషించి ఏవైనా లోపాలుంటే చెబితే వాటిని సరిచేసుకుంటామని, మరింత కట్టుదిట్టంగా సైట్ ను రూపొందిస్తామని ప్రకటించారు. సైట్ ను మంచిగా తీర్చిదిద్దేందుకే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బర్డ్ వాచ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

More Telugu News