Chandrababu: 'తెలుగు వెలుగు'లకు జగన్, చంద్ర‌బాబు, కేటీఆర్ అభినంద‌న‌లు

chandrababu wishes padma shri awardees
  • పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వ్య‌క్తులు
  • ప్ర‌శంస‌లు కురిపించిన జ‌గ‌న్, చంద్ర‌బాబు
  • గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కేటీఆర్ శుభాకాంక్ష‌లు
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వ్య‌క్తుల‌పై ప‌లువురు నేత‌లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అభినందనలు తెలిపారు. వారు సాధించిన అవార్డులు  రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. పురస్కార గ్రహీతలు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చారని చెప్పారు.

వారిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 'పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువెలుగులు.. ఏపీకి చెందిన వాయులీన విద్వాంసులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తెలంగాణకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుగార్లకు హృదయపూర్వక అభినందనలు' అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.
 
'వివిధ భాషల్లో దాదాపు 40 వేల పాటలు ఆలపించి కళకు భాషాభేదం లేదని నిరూపించిన గానగంధర్వుడు... తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు కీ.శే.బాలసుబ్రహ్మమణ్యంగారికి భారతదేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు రావడం సంతోషకరం' అని చెప్పారు.

'అలాగే, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు-2021కు ఎంపికైన తెలుగుబాలలు.. విశాఖకు చెందిన భరతనాట్య కళాకారిణి అమేయ లగుడు, హైదరాబాద్‌కు చెందిన వెబ్‌ డెవలపింగ్‌ ఇన్నోవేటర్‌ హేమేష్ చదలవాడలకు అభినందనలు. చిన్నవయసులోనే ప్రపంచ ప్రశంసలు అందుకున్న మీ ప్రతిభ బాలలందరికీ స్ఫూర్తిదాయకం' అని చంద్ర‌బాబు అన్నారు.

కనకరాజు గారికి అభినంద‌న‌లు: కేటీఆర్

కుమ‌రం భీం  జిల్లాకు చెందిన గుస్సాడీ డ్యాన్స్‌‌ మాస్టర్‌‌ కనకరాజు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నేప‌థ్యంలో ఆయ‌న‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గుస్సాడీ నృత్యానికి గుర్తింపు తెచ్చినందుకు గాను కళా‌‌ విభాగంలో ఆయనను ఈ అవార్డుకు కేంద్రం ఎంపిక చేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 'ఆదివాసీ సంప్రదాయ గుస్సాడి నృత్యంలో ప్రావీణ్యం ఉన్న కనకరాజు గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. వారు కుమరం భీం జిల్లా మర్లవాయి వాస్తవ్యులు. శ్రీ కనకరాజు గారికి హార్ధిక అభినందనలు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam
India
KTR

More Telugu News